: బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు : హరీష్ రావు
బయ్యారం ఇనుప ఖనిజాన్ని వినియోగించుకునేలా ఓ స్టీల్ ప్లాంటును తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండు చేశారు. బయ్యారం ఉక్కు .. తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు, ఇక్కడి నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖకు ఎందుకు తరలించాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. చెత్తను, కాలుష్యాన్ని తెలంగాణలో వదిలేసి, శుద్ధి ఖనిజాన్ని విశాఖకు తీసుకెళ్తారా? అని ప్రశ్నించారు. బయ్యారం గనులకోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకు సిద్ధమని, వదిలిపెట్టే సమస్యలేదని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ భవన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన హరీశ్.. బయ్యారం ఇనుప ఖనిజం వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటో గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. రచ్చబండ ముందుగా ఖమ్మం నుంచి ఆయన మొదలుపెట్టాలని డిమాండు చేశారు.