: నటనపై మాకు నమ్మకం లేదు... ఆ పాపంలో పాలుపంచుకోం: భూసేకరణ బిల్లుపై శివసేన
కేంద్ర పాలన పగ్గాలు దక్కించుకున్న బీజేపీపై మిత్రపక్షం శివసేన విరుచుకుపడింది. మోదీ సర్కారుపై మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసింది. భూసేకరణ బిల్లు రైతుల ఉసురు తీసేదేనని వ్యాఖ్యానించింది. రైతులను మోసగించే పాపంలో తాము పాలుపంచుకోలేమని తెగేసి చెప్పింది. రైతు ప్రాణాలను బలిపెట్టి అభివృద్ది చేస్తామంటే, తాము మద్దతు పలికేది లేదని తేల్చిచెప్పింది. ఈ కారణంగానే నరేంద్ర మోదీ ప్రతిపాదించిన భూసేకరణ బిల్లు ఓటింగ్ ను బహిష్కరించామని స్పష్టం చేసింది. ఈ మేరకు నేటి తన సొంత పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్ లో ఘాటు వ్యాఖ్యలతో బీజేపీపై విరుచుకుపడింది. ‘‘కేంద్రంలోనే కాక మహారాష్ట్రలోనూ బీజేపీకి మేము మిత్రపక్షాలమైతే కావొచ్చు, అంతమాత్రాన ప్రతి అంశంలో గుడ్డిగా వెళ్లదలచుకోలేదు. బిల్లును వ్యతిరేకించామంటే, నటనపై మాకు నమ్మకం లేకపోవడమే. భారీ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా పాపాలకు ఒడిగట్టడంలో మేం భాగస్వాములం కాలేము. రైతుల జీవితాలను నాశనం చేసి మేం సంతోషంగా ఉండలేం. రైతులకు మద్దతు పలుకుతున్న కారణంగా మేం దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నామని భావించవద్దు’’ అని ఆ కథనంలో పేర్కొంది.