: రెడ్డిరాజులు చెరువులు తవ్వితే... పాలకులు చెడగొట్టారు: కేసీఆర్
రెడ్డిరాజులు తవ్విన చెరువులను నేటి పాలకులు పాడు చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ లోని చెరువులో పూడికతీత పనులు ప్రారంభించిన ఆయన మిషన్ కాకతీయకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యేళ్ల క్రితం కాకతీయ రెడ్డిరాజులు తెలంగాణలో 70 వేల చెరువులను తవ్వారన్నారు. చెరువులను తవ్విన రెడ్డిరాజులు వాటిని కాపాడుకుంటూనే వచ్చారన్నారు. వారి అనంతరం వచ్చిన చాలామంది రాజులు కూడా చెరువులకు ఏమాత్రం నష్టం చేకూర్చలేదని తెలిపారు. కొత్తగా వచ్చిన రాజకీయ పాలకులు చెరువులను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రెడ్డిరాజులు తవ్విన చెరువులకు పునర్వైభవం తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. తద్వారా గ్రామసీమలను సుసంపన్నం చేస్తామని కేసీఆర్ వివరించారు.