: అతడు మహిళను దారుణంగా హత్య చేశాడు... లాకప్ డెత్ ఘటనపై మెదక్ జిల్లా ఎస్పీ సుమతి


మెదక్ జిల్లా పుల్కల్ పోలీస్ స్టేషన్ లో నేటి ఉదయం వెలుగుచూసిన లాకప్ డెత్ ఘటనపై జిల్లా ఎస్పీ సుమతి స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు టీవీ ఛానెల్ తో మాట్లాడిన ఆమె, నిందితుడిని నిన్ననే అరెస్ట్ చేశామని తెలిపారు. నిన్న అరెస్ట్ చేసిన లక్ష్మణ్ ను నేడు రిమాండ్ కు తరలించాల్సి ఉందన్నారు. మూడు రోజుల క్రితం అతడిని అదుపులోకి తీసుకున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె తెలిపారు. 30 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసినందుకే లక్ష్మణ్ ను అరెస్ట్ చేశామన్నారు. మహిళను పాశవికంగా హత్య చేయడమే కాక, ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు లక్ష్మణ్ యత్నించాడని కూడా ఎస్పీ తెలిపారు. అయితే పోలీస్ స్టేషన్ లో అతడు మరణించిన వైనంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News