: కేంద్రం సాయం చేస్తేనే నిలదొక్కుకుంటాం... ప్రపంచంలోనే మెరుగైన గమ్యస్థానంగా ఏపీని నిలుపుతాం: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సాయం చేస్తేనే నిలదొక్కుకుంటామని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ప్రసంగించారు. 2029 నాటికి దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఏపీని తయారుచేస్తామన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే మంచి గమ్యస్థానంగా రాష్ట్రాన్ని నిలుపుతామని పేర్కొన్నారు. 40 వేల ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ఇస్తామని సింగపూర్ చెప్పిందని, జపాన్ కూడా ముందుకొచ్చిందని చెప్పారు. ప్రాధాన్యత గల గమ్యస్థానంగా మన రాష్ట్రాన్ని జపాన్ ఎంచుకుందన్నారు. కోర్ క్యాపిటల్ వద్ద 225 కి.మీ రింగ్ రోడ్డు వస్తుందని, ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన నగరంగా రాజధాని ఉంటుందని వివరించారు. భూ సమీకరణకు సహకరించిన రైతులను తన జీవితంలో మర్చిపోనన్న బాబు, రాజధాని వస్తే భూముల విలువ పెరుగుతుందన్నారు. అడవుల్లో రాజధాని కట్టుకోవడం మంచిదికాదన్నారు. దేశంలోనే పింఛన్లు ఐదు రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. రాబోయే రెండు నెలల్లో ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. జీఎస్ డీపీని 12 శాతం పెంచాలని ప్రణాళిక తయారుచేశామని చెప్పిన సీఎం, కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించామని వెల్లడించారు. నాలుగైదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. బీసీ ఉపప్రణాళికను తీసుకొస్తున్నామని, బీసీల రుణాలు మాఫీ చేస్తామని, మైనారిటీలను పూర్తిగా ఆదుకుంటామని, కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని తెలిపారు. త్వరలో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరినీ బెదిరించలేమన్నారు.

  • Loading...

More Telugu News