: నేను మొనగాడిలా కనిపించేది వాళ్లు రాణించినప్పుడే: ధోనీ
నిన్నమొన్నటి దాకా కెప్టెన్ ధోనీకి తలనొప్పిలా పరిణమించిన బౌలింగ్ విభాగం ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది. వరల్డ్ కప్ లో ప్రత్యర్థి ఎవరైనా ఆలౌట్ చేయడమే లక్ష్యమన్నట్టు చెలరేగిపోతున్న షమీ, యాదవ్, అశ్విన్ తదితరులను చూసి ధోనీ మురిసిపోతున్నాడు. తాజాగా, మీడియాతో మాట్లాడుతూ, తాను విజయవంతం అవడం వెనుక బౌలర్లది కీలకపాత్ర అని అన్నాడు. వాళ్లు రాణించినప్పుడే తాను అత్యుత్తమ కెప్టెన్ లా కనిపిస్తానని నిజాయతీ ప్రదర్శించాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు జవాబిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించాడు. బౌలర్లు ప్రణాళికకు అనుగుణంగా రాణిస్తూ తన పని సులువు చేస్తున్నారని కొనియాడాడు. అలా బౌలింగ్ చేయి, ఇలా బౌలింగ్ చేయి... అని చెబుతూ ఉంటే వారిపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ తో టెస్టు సిరీస్ నుంచి బౌలర్లు గుణపాఠాలను చాలా త్వరగా నేర్చుకున్నారని పేర్కొన్నాడు.