: నల్లమలలో మావోల అలజడి... కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు
నల్లమల అడవుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మావోల సమావేశాలు, పోలీసుల కాల్పులతో నిత్యం రావణకాష్టంలా మారిన నల్లమల అడవులు కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలయ్యాయి. ఈ క్రమంలో నేటి ఉదయం నల్లమలలో అలజడి రేగింది. మావోల సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా పరిధిలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలోని మత్స్యకారులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మావోలు కనిపిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన పోలీసులు, మావోలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని మత్స్యకారులను హెచ్చరించారు.