: సీఎం కావాలన్న కోరిక నాకు లేదు... వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కేఈ అసహనం
ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకెంత మాత్రం లేదని ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ (వైకాపా) మాట్లాడుతూ రాజధాని కోసం జరిగిన భూ సమీకరణపై పలు అంశాలను లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన... కేఈకి తన తండ్రితో మంచి సంబంధాలుండేవని వ్యాఖ్యానించారు. సీఎం కావాలన్న తన కోరికను కేఈ తన తండ్రి ముందు వెల్లడించినట్లు చెప్పారు. దీనికి వేగంగా స్పందించిన కేఈ, తనకు సీఎం కావాలన్న కోరికే లేదని ప్రకటించారు. అంతేకాక బుగ్గన చెప్పినట్లు తానెవరి వద్ద సదరు వ్యాఖ్యలు చేయలేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను డిప్యూటీ సీఎం అయ్యానని, తనకు దక్కిన ఈ పదవితో తన నియోజకవర్గ ప్రజలు సంతోషంగానే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.