: ఇంట్లో మాదక ద్రవ్యాలు... స్టేషన్ లాకర్లో వజ్రాలు: డ్రగ్స్ రవాణాలో ముంబై కానిస్టేబుల్
ధర్మరాజ్ కాలోఖే ముంబైలోని మెరైన్ బీచ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నా, డ్రగ్స్ అక్రమ రవాణాను ప్రవృత్తిగా ఎంచుకుని బాగానే సంపాదించాడు. వజ్రాలు కొనుగోలు చేసేంత స్థాయికి ఎదిగాడు. అయితే మాదక ద్రవ్యాల నిరోధక శాఖ అధికారుల దాడులతో అతడి ఘరారా మోసం బయటపడింది. ఈ తంతు ఏళ్లుగా కొనసాగుతున్నా, ఇటీవల అందిన విశ్వసనీయ సమాచారంతో యాంటీ డ్రగ్స్ అధికారులు అతడి ఇల్లు, స్టేషన్ లోని అతడి లాకర్ ను చూసి నోరెళ్లబెట్టారు. సతారాలోని అతడి ఇంటిలో 110 కేజీల మెఫడ్రోన్ అనే డ్రగ్ తో పాటు స్టేషన్ లోని అతడి లాకర్ నుంచి 12 వజ్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక వజ్రాల్లో కూడా మాదక ద్రవ్యం ఉందన్న అనుమానంతో వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. ఇదిలా ఉంటే, తన బండారం బయటపడిందని తెలుసుకున్న కాలోఖే, తన తండ్రి చనిపోయాడని చెప్పి సెలవు తీసుకుని ఉడాయించాడు.