: 'ఇండియాస్ డాటర్'... ఓ ఫేక్ డాక్యుమెంటరీ అంటున్న 'నిర్భయ' మిత్రుడు
ఢిల్లీలో 2012 డిసెంబర్ 16 రాత్రి ఏం జరిగిందన్న విషయాన్ని తాను రూపొందించిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ కళ్లకు కట్టినట్టు వివరిస్తుందని బ్రిటీష్ ఫిలింమేకర్ లెస్లీ ఉడ్విన్ అంటుండగా, అదో నకిలీ డాక్యుమెంటరీ అని 'నిర్భయ' మిత్రుడు అవనీంద్ర పాండే అంటున్నాడు. 'నిర్భయ'పై దారుణ అత్యాచారం జరిగిన సమయంలో పాండే కూడా ఆమె పక్కనే నిస్సహాయంగా ఉండిపోయాడు. ఘటనకు అతడే ప్రత్యక్ష సాక్షి. తాజాగా, ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై పాండే స్పందించాడు. ఆ డాక్యుమెంటరీలో బాధితురాలి కోణాన్ని చూపలేకపోయారని విమర్శించాడు. ఆ చిత్రంలో సమతూకం లేదని అభిప్రాయపడ్డాడు. నిజాలు దాచిపెట్టారని, అందులో ఉన్న విషయం సరైనది కాదని అన్నాడు. "ఆ రాత్రి ఏం జరిగిందన్నది జ్యోతి (నిర్భయ అసలు పేరు)కి, నాకు మాత్రమే తెలుసు. కానీ, ఈ డాక్యుమెంటరీ వాస్తవదూరంగా ఉంది" అని పేర్కొన్నాడు. డాక్యుమెంటరీలో సతేంద్ర అనే ట్యూటర్ పాత్ర ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని పాండే స్పష్టం చేశాడు. ఆసలా పేరు ఎప్పుడూ వినలేదని అన్నాడు.