: అమెరికాలో అంతే... విధులకు కాస్త ముందే వచ్చాడని జైలుకు పంపారు!
అమెరికాలో చట్టాలు, నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిన విషయమే. తాజాగా, ఓ పారిశుద్ధ్య కార్మికుడు నిర్దేశిత సమయం కంటే ముందే చెత్తను ఎత్తేందుకు వచ్చాడంటూ అతడికి జైలు శిక్ష విధించారు. జార్జియా రాష్ట్రంలో జరిగిందీ ఘటన. వివరాల్లోకెళితే... సదరు రాష్ట్రంలోని శాండీ స్ప్రింగ్స్ నగరంలో ఉదయం ఏడింటి నుంచి రాత్రి ఏడింటి మధ్యలోనే చెత్తను సేకరించాలి. అక్కడి నిబంధనలు అలా ఉన్నాయి. కానీ, కెవిన్ మెక్ గిల్ అనే కార్మికుడు కాస్త ముందుగానే, అంటే ఉదయం ఐదింటికే చెత్త ఎత్తివేతకు బయల్దేరాడు. ఇది గమనించిన అధికారులు నిబంధనల ఉల్లంఘన కింద అతడిని కోర్టులో హాజరుపర్చగా, అతడికి నెల రోజుల జైలు శిక్ష పడింది. కాగా, తనకు శిక్ష విధించడంపై దిగ్భ్రాంతికి గురయ్యానని మెక్ గిల్ చెప్పాడు. తాను చెప్పిందేదీ సొలిసిటర్ వినిపించుకోలేదని వాపోయాడు. అయితే, అతనికి ఊరట కలిగించేలా, వారాంతాల్లో జైల్లో ఉండడం ద్వారా శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవచ్చని కోర్టు వెసులుబాటు కల్పించింది.