: రాజకీయాల నుంచి తప్పుకుంటానని కన్నీరు కార్చిన కేజ్రీవాల్!
ఆమ్ ఆద్మీ పార్టీలో 'అన్నీ తానై' వ్యవహారాలు సాగిస్తున్నాడని సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ గతంలో రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని కేజ్రీవాల్ సహచరుడు అశుతోష్ వెల్లడించారు. 'ది క్రౌన్ ప్రిన్స్, ది గ్లాడియేటర్ అండ్ ది హోప్' పేరిట తను రాసిన పుస్తకంలో ఆయన పలు విషయాలు చర్చించారు. గత సంవత్సరం జూన్ లో పార్టీ జాతీయ కమిటీ సమావేశాల్లో కేజ్రీవాల్ పై విమర్శలు వచ్చిన సంగతిని ప్రస్తావిస్తూ, అప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారని తెలిపారు. ఆ రోజు సమావేశంలో కేజ్రీవాల్ ముఖం వాడిపోయిందని, కన్నీరు కార్చారని తెలిపారు. ఏదో మాట్లాడాలని లేచిన ఆయన ఏమీ మాట్లాడకుండా కూలబడ్డారని పేర్కొన్నారు. ఆ వెంటనే తను, మహారాష్ట్రలో నితిన్ గడ్కరీపై పోటీ చేసి ఓటమిపాలైన అంజలి పరుగున వెళ్లి ఆయనను ఓదార్చినట్టు తెలిపారు. అంజలి సైతం పెద్దగా ఏడుస్తూ "మనమంతా సిగ్గుపడాలి. ఇదేనా మనం ఆయనకు ఇచ్చే గౌరవం?" అని అరిచినట్టు తన పుస్తకంలో అశుతోష్ తెలియజేశారు. ఆ తరువాత తేరుకున్న కేజ్రీవాల్ తనను ఆప్ కన్వీనర్ గా తొలగించి మరొకరిని ఎన్నుకోవాలని సూచించారట. ఆ మరుసటి రోజు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పారని అశుతోష్ వివరించారు.