: మైకివ్వట్లేదన్న జగన్... పొరబడుతున్నారన్న స్పీకర్!
మునుపటి సమావేశాల్లో మాదిరే ప్రస్తుత సమావేశాల్లోనూ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అధికార పక్ష సభ్యులు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తుంటే, కనీసం వివరణ ఇచ్చుకునేందుకు కూడా స్పీకర్ తనకు అనుమతివ్వడం లేదని జగన్ ఆరోపించారు. అధికార పక్ష సభ్యులను పేర్లు పెట్టి పిలిచి మరీ మైకులిస్తున్న స్పీకర్, ఆరోపణలకు వివరణ ఇచ్చుకుంటాం... మైకివ్వండని ఎన్నిసార్లు చేతులెత్తినా మైకు ఇవ్వట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కల్పించుకున్న స్పీకర్ కోడెల మాట్లాడుతూ... జగన్ పొరబడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ఎన్నిసార్లైనా మాట్లాడే హక్కు జగన్ కు ఉందన్న ఆయన, ప్రతిసారీ ప్రసంగం చేస్తానంటే మాత్రం కుదరదని తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.