: చదివింది 8, చెప్పేది ఇంజనీరింగ్ విద్యార్థులకు... కటకటాల వెనక్కు దొంగ ప్రొఫెసర్
గుంటూరుకు చెందిన అశోక్ కుమార్ చౌదరి ఎనిమిదవ తరగతి వరకూ మాత్రమే చదివాడు. అయితేనేం, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)లో పీహెచ్‌డీ చేసినట్లు దొంగ పట్టాలు సృష్టించి నెలకు రూ. 1.12 లక్షల వేతనానికి ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా విధుల్లో చేరాడు. మూడేళ్లపాటు పాఠాలు చెప్పాడు. సహచరులకు వచ్చిన చిన్న అనుమానంతో అడ్డంగా దొరికిపోయాడు. పోలీసు దర్యాప్తులో నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు, కళాశాల అధికారులు ఆశ్చర్యపోయారు. గుంటూరుకు చెందిన అశోక్ కుమార్ ఎనిమిదో తరగతిని మధ్యలోనే ఆపేశాడు. కొన్నాళ్లు ఒక జిరాక్స్ సెంటర్లో పనిచేశాడు. ఆ సమయంలో పాఠ్యపుస్తకాలకు నకళ్లు తీసే సమయంలో వాటిని చదువుతూ, చాలా విషయాలపై అవగాహన పెంచుకున్నాడు. చదువు లేకపోవడంతో నకిలీ పట్టాలు సృష్టించి మంచి ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఎమ్మెస్సీ ధ్రువపత్రం సృష్టించి క్యాట్ రాయడానికి ఓ శిక్షణ కేంద్రంలో చేరగా, ఆయన ప్రతిభను గుర్తించి పార్ట్ టైమ్ అధ్యాపకుడిగా ఉద్యోగమిచ్చారు. మరో మంచి ఉద్యోగం కోసం పీహెచ్‌డీ చేసిన బి.రవికుమార్‌రెడ్డి అనే వ్యక్తి పేరుతో నకిలీ ధ్రువపత్రం సృష్టించుకున్నాడు. దాన్ని చూపించి ట్రిపుల్ ఈలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందాడు. తాను బోధించబోయే పాఠ్యాంశాలకు సంబంధించి ముందురోజే ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని విద్యార్థులకు చెప్పేవాడు. ఇటీవల ఐఐఎస్సీకి చెందిన ఇద్దరు ఆచార్యులతో కూడిన అకడమిక్ బృందం రాగా, వారిని కలిసేందుకు రవికుమార్‌రెడ్డిగా నటిస్తున్న అశోక్ ఎంతమాత్రమూ ఆసక్తి చూపలేదు. అనుమానం వచ్చి ఆయన పీహెచ్‌డీ వివరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.