: ‘ఓపెన్ బాత్’ను చాటుగా చిత్రీకరించిన యువకుడికి చెప్పుదెబ్బలు... వాట్సప్ లో ఫొటోలకు ‘లైక్’ల వెల్లువ
విహార యాత్రలో భాగంగా నదిలో స్నానం చేస్తున్న యువతులను ఓ ఆకతాయి తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆకతాయి దుశ్చర్యను గమనించిన ఓ యువతి స్నేహితులతో కలిసి ఆ యువకుడిని పట్టుకుని బంధించింది. అంతేకాక నీతిమాలిన పనికి పాల్పడ్డ ఆ యువకుడిని తన చెప్పుతో చితకబాదింది. ఈ దృశ్యాలను కెమెరాల్లో బంధించిన కొందరు వాటిని వాట్సప్ లో పెట్టారు. మహిళా దినోత్సవం రోజైన నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి యువతి ధైర్యాన్ని కీర్తిస్తూ వాట్సప్ లోని ఆ ఫొటోలకు ‘లైక్’ లు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకెళితే... కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి విహార యాత్రకు వచ్చిన కొంతమంది యువతులు అక్కడి కావేరీ సంగమంలో స్నానానికి ఉపక్రమించారు. దీనిని గమనించిన ఓ యువకుడు సదరు యువతుల ‘ఓపెన్ బాత్’ ను తన సెల్ ఫోన్లో చిత్రీకరించేందుకు చెట్టెక్కాడు. ఈ క్రమంలో అతడెక్కిన చెట్టు చాటుకు వచ్చి ఓ యువతి దుస్తులు మార్చుకుంది. ఈ దృశ్యాలను కూడా అతడు తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆకతాయి దుశ్చర్యను పసిగట్టిన సదరు యువతి, తన స్నేహితులను అప్రమత్తం చేసింది. అయితే అక్కడినుంచి చిన్నగా జారుకునేందుకు యత్నించిన ఆకతాయిని పట్టుకుని బంధించిన యువతి, తన చెప్పుతో అతడి చెంపలు వాయించింది. ఈ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించిన స్థానికులు కొందరు, వాటిని వాట్సప్ లో పోస్ట్ చేశారు. యువతి ధైర్యాన్ని కీర్తిస్తూ సదరు ఫొటోలకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు.