: ఎక్కడో పుట్టిన 'ఫ్లాష్ మాబ్' కల్చర్... గుంటూరుకూ పాకింది!
పాశ్చాత్య దేశాల్లో మొదలైన 'ఫ్లాష్ మాబ్' సంస్కృతి ఇప్పుడు భారత్ లోని ఓ మోస్తరు నగరాలకు కూడా పాకింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నట్టుండి యువత డ్యాన్సులకు ఉపక్రమించడాన్ని 'ఫ్లాష్ మాబ్' గా పేర్కొంటారు. అయితే, ఇలా డ్యాన్సు చేయడం వెనుక ఓ సదుద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని వినూత్నంగా, ప్రభావవంతంగా వెల్లడించేందుకు ఈ 'ఫ్లాష్ మాబ్' మార్గాన్ని ఎంచుకుంటుంది యువత. తాజాగా, గుంటూరులోనూ 'ఫ్లాష్ మాబ్'తో అమ్మాయిలు, అబ్బాయిలు సందడి చేశారు. ఇక్కడి ప్రధాన ఆర్టీసీ బస్టాండులో విద్యార్థులు డ్యాన్సులతో అలరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారు పలు రంగాల్లో పేరుగాంచిన మహిళల చిత్రాలను ప్రదర్శించారు. తద్వారా, మహిళా శక్తిని చాటే ప్రయత్నం చేశారు. ఈ 'ఫ్లాష్ మాబ్' ను పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.