: ఖబడ్దార్ కేసీఆర్... నీ అంతు చూస్తాం: భట్టి విక్రమార్క ఫైర్
తెలంగాణ పీసీీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై నిప్పులు చెరిగారు. హైదరాబాదు గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ... 'ఖబడ్దార్ కేసీఆర్... నీ అంతు చూస్తాం' అంటూ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని కుట్ర పన్నాడని విమర్శించారు. మహా ఉద్యమం చేసిన కాంగ్రెస్ నేతలు, వారి వారసులుగా ఉన్న కార్యకర్తలు నేడు కేసీఆర్ తుపాకీ చప్పుళ్లకు భయపడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. భయపడతారని భావిస్తే అది కేసీఆర్ మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. కేసీఆర్ తప్పులు ఎక్కువైపోయాయని, ఇక చర్య తప్పదని మల్లు హెచ్చరించారు. చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇక ఎంతమాత్రం సిద్ధంగా లేదన్నారు. జానారెడ్డి నాయకత్వంలో శాసనసభలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ముందుకెళతామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసు కేసులను ఉపేక్షించేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాంటి వాళ్లను చాలామందిని చూసిందని పేర్కొన్నారు. కేసీఆర్ వంటి వాళ్లు చరిత్రలో చాలామంది వచ్చారు, పోయారని వ్యాఖ్యానించారు. చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. ఏ ఉద్దేశం కోసమైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో, ఇప్పుడా ఉద్దేశం కేసీఆర్ పాలనలో నీరుగారి పోతోందని విమర్శించారు. ఆ ఉద్దేశం నెరవేరేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావడానికైనా, బీడు భూములు సస్యశ్యామలం అయ్యేందుకైనా, రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డ చదువుకునేందుకైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు.