: ఫోన్ మాట్లాడుతున్న భారత మహిళను పొడిచి చంపారు!
ఆస్ట్రేలియాలో ఐటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న ప్రభా అరుణ్ కుమార్ (41) అనే భారత మహిళ దారుణ హత్యకు గురైంది. సిడ్నీ శివారు ప్రాంతం వెస్ట్ మీడ్ లో ఆ ఘాతుకం జరిగింది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఫోన్ లో మాట్లాడుతుండగా ఆమె కత్తిపోట్లకు గురైంది. తనపై దాడి జరిగిన విషయాన్ని ప్రభా ఫోన్ లో అవతలి వ్యక్తికి చెప్పినట్టు తెలిసింది. ఆమె నివాసానికి 300 మీటర్ల దూరంలోనే ఓ పార్కు వద్ద ఈ ఘోరం జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రభాను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెస్ట్ మీడ్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ప్రభా స్నేహితురాలు ఈ ఘటనపై మాట్లాడుతూ, పారామట్టా పార్క్ వద్ద బాగా పొద్దుపోయిన తర్వాత సంచరించడం మంచిది కాదని చెప్పానని, కేవలం 2 డాలర్లకు కూడా హత్యలకు తెగిస్తారని హెచ్చరించానని తెలిపింది. ఇంటికి చేరుకునే సమయంలో లిఫ్ట్ అడగడానికి కూడా ప్రభాకు మొహమాటం అని పేర్కొంది. పోలీసులు ఈ ఘటనను 'భయానక దాడి'గా వర్ణించారు. కాగా, భార్య మరణ వార్త విన్న వెంటనే ప్రభా భర్త బెంగళూరు నుంచి సిడ్నీ పయనమయ్యారు.