: తెలుగింటి ఆడపడుచులకు ఎప్పుడూ రుణపడి ఉంటా: చంద్రబాబు


నెల్లూరులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, సినీ నటి 'షావుకారు' జానకి, గాయని ఎల్ఆర్ ఈశ్వరి, ప్రఖ్యాత స్త్రీవాద రచయిత్రి ఓల్గా, గాయని సునీత తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగింటి ఆడపడుచులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. మహిళలను అన్నిరంగాల్లో రాణించేలా చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని, తమది మహిళల రక్షణకు అంకితమైన ప్రభుత్వమని ఉద్ఘాటించారు. మహిళలు తలెత్తుకు తిరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలనే డ్వాక్రా సంఘాలు స్థాపించామని, ఆడవాళ్లు వంటగదిలో బాధపడకూడదనే దీపం కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. అంగన్ వాడీలు, డ్వాక్రా మహిళలు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. వారి న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నానని సభాముఖంగా స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ద్వారా శక్తియుక్తులను చాటాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వయోజన విద్య ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు తెస్తామన్నారు. వయోజన విద్య ద్వారా వ్యాపారంలో కిటుకులు బోధిస్తామని తెలిపారు. మహిళలు తమకాళ్లపై తాము నిలబడేందుకు కృషి చేయాలని సూచించారు. సెల్ ఫోన్ల ద్వారా ఇంటి నుంచే వ్యాపారాలు చేసుకోవచ్చని, స్వయం ఉపాధి అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అవసరమని సీఎం పునరుద్ఘాటించారు. సెల్ ఫోన్ లేకుండా ఎవరూ లేరని, కానీ, మరుగుదొడ్డి లేని ఇళ్లు మాత్రం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో 13 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. స్వచ్ఛ భారత్ తరహాలో రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేపట్టామని, ఈ కార్యక్రమంలో మహిళలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై వేధింపులు జరగకూడదన్నది తమ లక్ష్యమని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని బాబు హెచ్చరించారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఇక, నెల్లూరు జిల్లా మహిళలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సింహపురి మహిళలు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారని, అనేకమంది నెల్లూరు మహిళలు తమ ఆస్తులు కూడా రాసిచ్చారని గుర్తుచేశారు. దూబగుంట రోశమ్మ అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంతకుముందు ఆయన కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారాయణ, పీతల సుజాత, మృణాళిని తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News