: రక్తమోడిన రహదారులు... రెండు బస్సులు ఢీ, పెళ్లి వాహనం బోల్తా
నేటి తెల్లవారుజామున రహదారులు రక్తమోడాయి. పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. పుత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు, మెదక్ నుంచి తిరుపతి వెళ్తున్న బస్సులు ఢీకొనగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఘటనలో పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనం బోల్తాపడగా అందులో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో గత రాత్రి వేగంగా వస్తున్న పెళ్లి వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇదిలావుండగా, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఓ ఫ్లై ఓవర్ పైనుంచి ఒక లారీ కిందపడింది. నేటి ఉదయం ఘటన జరుగగా, లారీలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.