: బీఏసీ సమావేశంలో వైఎస్ జగన్ హాట్ కామెంట్... రాజకీయ వర్గాల్లో దుమారం!
ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో విపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారట. తాను మాట్లాడడానికి అడిగినంత సమయం ఇవ్వకపోతే సభలో అభ్యంతరకర దృశ్యాలు చూడాల్సి వస్తుందని జగన్ అన్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. ఆ వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ ఖండించారని తెలిసింది. అధికార పార్టీతో సమానంగా తమకూ సమయం ఇవ్వాలని, మంత్రుల ప్రసంగాల సమయాన్ని అధికార పార్టీకి కేటాయించే సమయంలో కలపాలని జగన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపగా, పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఆయన తీరు సరికాదని విమర్శించారు.