: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి మిగిలేది... 7 వేల ఎకరాలేగా!: చంద్రబాబు వ్యాఖ్య
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం సేకరించిన భూమి ఎంత? 33 వేల ఎకరాలని సాక్షాత్తు ఏపీ సర్కారే ప్రకటించింది. అయితే, నిన్న తన మంత్రివర్గ సహచరులతో భేటీ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సేకరించింది 33 వేల ఎకరాలైనా, రాజధాని నిర్మాణం కోసం మిగిలేది కేవలం 7 వేల ఎకరాలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు ఆయన లెక్కలు కూడా చెప్పేశారు. కొత్తగా రూపుదిద్దుకోనున్న రాజధానిలో మౌలిక వసతుల సదుపాయాల కోసమే సగం మేర భూమి పోతుందని ఆయన చెప్పారు. మిగిలిన భూమిలో సగాన్ని రైతులకు వాటాగా ఇవ్వాల్సి ఉంది. ఇక మిగిలేది 7 వేల ఏకరాలేనంటూ ఆయన గణాంకాల సహా మంత్రుల ముందు చిట్టా విప్పారు. వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణంపై విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలకూ ఆయన సూటిగా సమాధానం చెప్పారు. ‘‘హైదరాబాదులో శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో కట్టాం. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం 7 వేల ఎకరాల భూమి కూడా వద్దా?’’ అంటూ ఆయన విపక్షాలను సూటిగా ప్రశ్నించారు.