: 'స్పీడ్ మురుగేశ్'కు వరల్డ్ కప్ పిచ్చి మళ్లీ తలకెక్కింది!


మామూలు రోజుల్లోనే భారత్ లో క్రికెట్ అంటే పడిచస్తుంటారు! అలాంటిది వరల్డ్ కప్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఈ చెన్నై ఆటోవాలా కూడా ఇలాంటి వాడే. అతడి పేరు స్పీడ్ మురుగేశ్. క్రికెట్ అంటే పిచ్చి. ఎంతలా అంటే, టీమిండియా వరల్డ్ కప్ నెగ్గితే రెండ్రోజుల పాటు తన ఆటోలో ప్రయాణికులను ఉచితంగానే గమ్యస్థానాలకు తీసుకెళతానని ప్రకటించేశాడు. పెరిగిన ఆయిల్ ధరలను పట్టించుకోడట. బాల్యం నుంచే క్రికెట్ అంటే వెర్రి అభిమానమని, స్కూల్ జట్టుకు ఆడానని తెలిపాడు మురుగేశ్. ప్రస్తుతం గోపాలపురం గ్రౌండ్ లో టెన్నిస్ బాల్ మ్యాచ్ లు ఆడుతుంటానని వివరించాడు. సగటున రోజుకు రూ.1000 సంపాదిస్తానని, ఖర్చులన్నీ పోనూ రోజుకు సుమారు రూ.700 మిగులుతాయని తెలిపాడు. రెండ్రోజుల పాటు ఉచితంగా ఆటో నడిపితే దాదాపు రూ. 1500 నష్టపోతానని, అయినా, టీమిండియా విజయం ముందు ఆ నష్టం ఏపాటిదని, బాధేమీలేదని స్పష్టం చేశాడు. కోహ్లీ, ధోనీ చిత్రాలున్న ఓ పోస్టర్ వేయించి దాన్ని తన ఆటో వెనుక అంటించాడు. దాంట్లో తన ఫోన్ నెంబర్ నూ పేర్కొన్నాడు. ఆ రెండ్రోజుల్లో ఎవరు ఫోన్ చేసినా వెంటనే అక్కడి చేరుకుని వారిని ఫ్రీగా తీసుకెళతాడట. అన్నట్టు... స్పీడ్ మురుగేశ్ ఇలా ఆఫర్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2011లో టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడంతో మనవాడు ఉచితంగా ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్లాడు. అతడి క్రికెట్ అభిమానాన్ని గుర్తించిన తమిళనాడు క్రికెట్ సంఘం రూ. 1 లక్ష నజరానాగా అందించింది. ఆ సొమ్ముతో తాను కొత్త ఆటో కొనుక్కున్నానని మురుగేశ్ తెలిపాడు. మనది మంచి జట్టని, వరల్డ్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటుందని ధీమాగా చెబుతున్నాడీ ఆటోవాలా. అతని ఆకాంక్ష నిజమైతే అంతకంటే కావాల్సిందేముంది?

  • Loading...

More Telugu News