: 'వాకా'లో రిస్కు తీసుకున్న ధోనీ
ఆశ్చర్యకరమైన నిర్ణయాలకు పెట్టిందిపేరైన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శుక్రవారం పెర్త్ లోని 'వాకా' మైదానంలోనూ అందరినీ విస్మయపరిచాడు. విండీస్ తో మ్యాచ్ లో అశ్విన్ వేసిన ఓ ఓవర్లో ధోనీ కాళ్లకు ప్యాడ్లు లేకుండా కీపింగ్ చేశాడు. ప్యాడ్లు విప్పి పక్కనే ఉన్న రహానేకు అందించాడు. ఈ తర్వాత ఓవర్ కు మాత్రం ప్యాడ్లు ధరించే కీపింగ్ చేశాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే... స్పిన్ బౌలింగ్ లో షార్ట్ ఫీల్డింగ్ పెట్టేందుకు ధోనీ నిర్ణయించుకున్నాడు. దాని కోసం రహానేను ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో మోహరించాడు. అయితే, రహానే కాళ్లకు రక్షణ లేకపోవడం గమనించిన కెప్టెన్ ధోనీ డ్రెస్సింగ్ రూం నుంచి ప్యాడ్లు తీసుకువచ్చేందుకు సమయం పడుతుందని భావించి తన కాళ్లకున్న ప్యాడ్లను విప్పి రహానేకు అందించాడు. కాళ్లకు ప్యాడ్లు లేకుండా కీపింగ్ చేయడం రిస్కు అని తెలిసినా ధోనీ సహచరుల రక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చి తన నాయకత్వ లక్షణాలను చాటుకున్నాడు.