: శాంతి కోసం నిరసన బాట పట్టిన ఇజ్రాయెల్ మహిళలు
దశాబ్దాలుగా ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య నెలకొన్న అశాంతికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ... ఇజ్రాయెల్ మహిళలు నిరసన బాట పట్టారు. మరో 10 రోజుల్లో ఇజ్రాయెల్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ, పాలస్తీనాతో శాంతి నెలకొల్పాలనే అంశం అక్కడ చర్చకు రాలేదు. దీన్ని నిరసిస్తూ, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వేలాది మంది మహిళలు ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనం ముందు ఆందోళన చేపట్టారు. 'ఉమెన్ వేజ్ పీస్' అనే సంస్థ ఆధ్వర్యంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత వేసవిలో జరిగిన పోరులో పాలస్తీనాకు చెందిన 2 వేల మంది చనిపోగా, ఇజ్రాయెల్ తరపున 70 మంది ప్రాణాలొదిలారు. దీంతో, శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన ఒప్పందాన్ని డిమాండ్ చేస్తూ 'ఉమెన్ వేజ్ పీస్' అనే సంస్థ ఏర్పాటయింది.