: 'నిర్భయ' డాక్యుమెంటరీపై నిషేధం ఎత్తివేయాలి: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా
'ఇండియాస్ డాటర్' పేరుతో రూపొందించిన 'నిర్భయ' డాక్యుమెంటరీపై విధించిన నిషేధం ఎత్తివేయాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. డాక్యుమెంటరీపై ప్రభుత్వ విధానం పూర్తిగా అసమంజసమైందని ఓ ప్రకటనలో పేర్కొంది. తమ కుమార్తె జీవితంలో జరిగిన దారుణం పట్ల ఓ కుటుంబం కనబర్చిన స్థైర్యం, వివేకం తదితర అంశాలను ఆ డాక్యుమెంటరీలో చిత్రీకరించారని పేర్కొంది. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిలో విద్యావంతులు, న్యాయవాదులు ఉన్న వైనాన్ని ఈ డాక్యుమెంటరీలో వివరించినట్టు ఎడిటర్స్ గిల్డ్ చెప్పింది. ప్రభుత్వ న్యాయ ప్రయోజనాల కోసం సినిమా విడుదల నిలిపివేయడంవల్ల మహిళల్లో భయాన్ని, ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారని అభిప్రాయపడింది. ఈ క్రమంలో నేరస్థులు తమ కేసుల కొనసాగింపునకు మీడియాను ఉపయోగించుకుంటారని ఎడిటర్స్ గిల్డ్ వ్యాఖ్యానించింది. కాబట్టి వెంటనే డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజలంతా చూసేందుకు అవకాశం కల్పించాలని కోరింది.