: బౌలర్లు భేష్... విండీస్ చేసింది 182 పరుగులే!


టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. ప్రపంచకప్ ముందు అందరూ అనుమానం వ్యక్తం చేసిన భారత బౌలింగ్ విభాగం అత్యంత పటిష్ఠంగా కనిపిస్తోంది. ఎవరి పరిధిలో వారు పొదుపుగా బౌలింగ్ చేస్తూ తమ ప్రతిభకు న్యాయం చేస్తున్నారు. మూడు వికెట్లు తీసి షమి రాణించగా, అతనికి ఉమేష్ యాదవ్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మోహిత్ శర్మ సహకరించి విండీస్ పతనాన్ని శాసించారు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విండీస్ కేవలం 44.2 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. జాసన్ హోల్డర్ (57) కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆదుకోకుంటే ఆ జట్టు మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టుకు స్మిత్ (6), గేల్ (21) వికెట్లను తీసి షమి షాకిచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే శామ్యూల్స్ (2) రనౌట్ అయ్యాడు. కార్టర్ (21) కాస్త ఫర్వాలేదనిపించాడు. రామ్ దిన్ ను ఉమేష్ యాదవ్ బౌల్డ్ చేయడంతో క్రీజులోకి వచ్చిన సిమ్మన్స్ (9) కాస్తా మోహిత్ శర్మకు బలయ్యాడు. సామీ (26) కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. రస్సెల్ (8) భారీ షాట్లు ఆడే క్రమంలో బుక్కయ్యాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్ (57) విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక, టేలర్ (11) బౌలర్ ఉమేష్ చేతికి చిక్కాడు. అనంతరం, హోల్డర్ కూడా అవుటవడంతో విండీస్ జట్టు 44.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది.

  • Loading...

More Telugu News