: ఎవరితో తిరుగుతున్నారో పట్టించుకోరా?: నిర్భయ కేసు డిఫెన్స్ లాయర్ వివాదాస్పద వ్యాఖ్యలు


నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వూ దుమారం రాజ్యసభను కుదిపేసిన కాసేపటికే ఈ కేసులో డిఫెన్స్ లాయర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. నిర్భయ డాక్యుమెంటరీలో తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిఫెన్స్ లాయర్ ఎమ్ఎల్ శర్మ మాట్లాడుతూ, బజారులో మిఠాయిలు పెడితే కుక్కలు ఎలా ఎగబడతాయో, సరైన రక్షణ లేకుండా బయట కనబడే అమ్మాయిలపై అత్యాచారాలు కూడా అలాగే సహజమని అన్నారు. బాగా పొద్దుపోయాక, వేరొకరితో బయటకు వెళ్లేందుకు నిర్భయ తల్లిదండ్రులు ఆమెనెలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. నిర్భయ వెంట ఉన్న వ్యక్తి ఆమె స్నేహితుడు కూడా కాదని, అతనితో వెళ్తే పర్లేదా? అని నిలదీశారు. ఆడపిల్లలు ఎవరితో వెళ్తున్నారు? ఏ సమయంలో వెళ్తున్నారు? ఎంత వరకు వారితో గడుపుతారు? వంటి విషయాలు కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా? అని అడిగారు. ఏదైనా అఘాయిత్యం జరిగితే కానీ బాధ్యతలు గుర్తుకు రావా? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై మరో డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, నిర్భయ డాక్యుమెంటరీపై విచారణ సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News