: ప్రధాని మోదీకి లేఖ రాసిన సినీనటుడు శివాజీ


భారత ప్రధాని నరేంద్ర మోదీకి సినీనటుడు, బీజేపీ నేత శివాజీ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడటానికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో ఆయన కోరారు. ఈ అంశం గురించి ఆయన మాట్లాడుతూ, వచ్చే వారం ఢిల్లీకి పిలుస్తామని చెప్పారని తెలిపారు. ప్రధాని మోదీపై తనకు పూర్తి నమ్మకముందని చెప్పారు. ఆయన మాట తప్పే మనిషి కాదని అన్నారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ హామీ ఇచ్చారని, ఎలాంటి పరిస్థితిలోనైనా తాను ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటారని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. మోదీతో ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి, రెండు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడతానని చెప్పారు. రెండు రాష్ట్రాలకు ప్రధాని న్యాయం చేస్తారని చెప్పారు. ప్రధాని తనకు తానుగా, స్పష్టంగా చెప్పేంత వరకు ప్రత్యేక ప్రతిపత్తిపై ఊహాగానాలు వద్దని సూచించారు. పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో వెంకయ్యనాయుడు పోరాడారన్న సంగతిని శివాజీ గుర్తు చేశారు. నిండు సభలో అప్పటి మంత్రి జైరామ్ రమేష్ అనేక విషయాలు చెప్పారని, ఆ సమయంలో కేవీపీ, చిరంజీవి, జేడీ శీలం లాంటి నేతలు కూడా సభలో ఉన్నారని చెప్పారు. స్పెషల్ స్టేటస్ కు రాజ్యాంగ పరమైన అవరోధాలు ఉంటే అమెండ్ మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని... దీనికోసం అన్ని పార్టీలు సహకరించాల్సి ఉందని శివాజీ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సహకరించుకుంటే, అందరూ సంతోషంగా ఉంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News