: ముఫ్తీ వ్యాఖ్యలపై వివాదం... మోదీపై నితీశ్ పరోక్ష వ్యాఖ్యలు
జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొంతసేపటికే ముఫ్తీ మొహమ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వానలా మారాయి. రాష్ట్రంలో ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి పాకిస్థానే కారణమంటూ ఆయన వ్యాఖ్యనించడంపై పలువురి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. "56 అంగుళాల ఛాతి కలిగిన నేతలు ముప్తీ ప్రకటనపై సమాధానమివ్వాలి. జమ్ము కాశ్మీర్ లో ఈ సంకీర్ణం ప్రజలను కచ్చితంగా విడదీస్తుంది" అని నితీశ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బీఎస్పీ అధినేత్రి మాయవతి మాట్లాడుతూ, "బీజేపీ, పీడీపీ పార్టీలకు విభిన్న భావజాలం, విధానం ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేశాక రెండు పార్టీలు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగుతుందని నేననుకోవడంలేదు" అని విమర్శించారు.