: బొగ్గు గనుల వేలంలోనూ అవకతవకలు... బిడ్లను పరీక్షించనున్న కేంద్రం
గత నెలలో జరిగిన బొగ్గు గనుల వేలంలో అవకతవకలు జరిగాయని వస్తున్న కథనాలపై కేంద్రం స్పందించింది. కంపెనీలు దాఖలు చేసిన బిడ్లను మరోసారి పరిశీలించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. జనవరిలో మొత్తం 18 బొగ్గు క్షేత్రాలకు వేలం నిర్వహించగా, కనీసం 3 గనులకు సంబంధించి ధరల్లో తీవ్ర వ్యత్యాసాలు వచ్చినట్టు గమనించిన కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీచేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూడు గనులకు సంబంధించి విజేతల వివరాలను నిలిపివుంచిన కేంద్రం విచారణ తరువాతే అధికారికంగా వారి పేర్లు ప్రకటించాలని నిర్ణయించింది. కాగా, ఈ మూడు గనులను జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఎస్ ఇస్పాత్, బాల్కోలు దక్కించుకున్నాయి. ఈ గనులను పొందిన వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో నేటి మార్కెట్ సెషన్ లో ఈ కంపెనీల ఈక్విటీ విలువ పడిపోయింది. వ్యాపార దిగ్గజం నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ వాటా ధర 4 శాతం దిగజారింది. తాము చత్తీస్ ఘడ్ లోని గారే పాల్మా -4 బొగ్గు క్షేత్రంలో గనులను గెలుచుకున్నామని గత నెల 19న జిందాల్ స్టీల్ తెలిపింది. ఈ క్రమంలో టన్ను బొగ్గును కేవలం రూ.108కే జిందాల్ పొందడం గమనార్హం. కాగా, అప్పటినుంచి బిడ్డింగ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు పెరిగాయి. తాము కొన్ని ప్రాథమిక సాక్ష్యాలు సేకరించామని మాత్రం తెలిపిన బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.