: ఈ నెల 12న ఏపీ సాధారణ బడ్జెట్: మంత్రి యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 నుంచి 27 వరకు జరుగుతాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. 7న గవర్నర్ ప్రసంగం, 12న సాధారణ బడ్జెట్, 13న వ్యవసాయ ఆధారిత రంగాల బడ్జెట్, 27న ద్రవ్యవినిమయ బిల్లు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామన్న యనమల, వాటికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఏపీ సచివాలయంలో తన కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పన్నులు పెంచాలన్న ఆలోచన లేదని, ఉన్న పన్నులు సక్రమంగా వసూలు చేస్తే చాలని అన్నారు. రాష్ట్రంలో కొన్ని ఉద్యోగాల భర్తికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటనలు చేస్తామని యనమల వెల్లడించారు. లెవీ సేకరణ 25 శాతానికి తగ్గించడం, ఆయిల్ ధరలు పెరగడం వల్లనే రాష్ట్ర ఆదాయం తగ్గిందని వివరించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి ప్రకటించిన రూ.850 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. కాగా, ఏపీ బడ్జెట్ రూ.లక్ష కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని అంచనా.