: టీమిండియాకు అనుకూలంగా ఐసీసీ వ్యవహరిస్తోంది: పాక్ మాజీ పేసర్
వరల్డ్ కప్ లో భారత్ ను ఓడించలేని పాక్ క్రికెటర్లు, తమ అక్కసును వెళ్లగక్కేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. తాజా వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియాపై పాక్ మాజీ పేసర్ సర్ఫరాజ్ నవాజ్ తన అక్కసు వెళ్లగక్కాడు. టీమిండియాకు ఐసీసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఈ కారణంగానే ధోనీ సేన వరుస విజయాలను సాధిస్తోందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పటిదాకా భారత్ ఆడిన మ్యాచ్ లు చూడండి. ఆ జట్టుకు అనువైన పిచ్ లపైనే ఆడింది. ఇప్పటికైనా పాక్ క్రికెట్ బోర్డు మేల్కోవాలి. ఐసీసీ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తి, జరుగుతున్న తంతు ఏమిటో నిగ్గుతేల్చాలి’’ అని అతడు ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా పేర్కొన్నాడు.