: ప్రస్తుత పాటల్లో ఎలాంటి అర్థాలు లేవు: బప్పీలహరి
ప్రస్తుతం వస్తున్న పాటల్లో ఎలాంటి అర్థాలు లేవని సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహరి వ్యాఖ్యానించారు. వినేందుకు కూడా ఇవి చాలా వింతగా ఉంటాయన్నారు. "ప్రస్తుత కాలంలో వస్తున్న పాటల్లో ఎలాంటి అర్థాలు వుండడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇటీవల వచ్చిన 'చార్ బాటిల్ వోడ్కా' వంటి పాటలు వినేందుకు చాలా చిరాకుగా ఉంటాయి. ఇందులో అన్ని పదాలు చిరాకుగా ఉంటాయి. సాహిత్యంపై తప్పకుండా ఆసక్తి కలిగేలా పాటలు వుండాలి" అని బప్పీ తెలిపారు. ఒక్కసారి పాత పాటల గురించి ఆలోచిస్తే ప్రజలు ఇప్పటికీ వాటిని గుర్తుంచుకుంటారని అన్నారు. నేటి పాటలకు మాత్రం భావాలతో పనిలేదని, చాలా వరకు పాటలు ద్వంద్వార్థాలతో వస్తున్నాయని పేర్కొన్నారు. అయినా వాటినే నేటి యువతరం ఇష్టపడుతున్నారని బప్పీ ఆవేదన వ్యక్తం చేశారు. గాయకుడిగా తాను 42 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉంటున్నానన్న ఆయన, తను పాడిన పాత పాటలు ఇప్పటికీ కనుమరుగుకానందుకు ఆనందంగా ఉందని అన్నారు.