: హిందువులూ... ఖాన్ త్రయం చిత్రాలను బహిష్కరించండి: బీజేపీ నేత సాధ్వీ ప్రాచీ
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీస్తున్న బీజేపీ నేతలు తమ దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నేత సాధ్వీ ప్రాచీ, బాలీవుడ్ ఖాన్ త్రయంపై విరుచుకుపడ్డారు. లవ్ జీహాద్ ను ప్రోత్సహిస్తున్న ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ల సినిమాలను బహిష్కరించాలని ఆమె హిందువులకు పిలుపునిచ్చారు. ఈ ఖాన్ త్రయం నటించే చిత్రాలనే కాక వారు నిర్మించే చిత్రాలను కూడా బహిష్కరించాలని ఆమె కోరారు. ఇక, మదర్ థెరిసాపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సాధ్వీ సమర్ధించారు. హిందువుల్లోని నిమ్న వర్గాలను క్రైస్తవులుగా మార్చేందుకు థెరిసా యత్నించారని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీపైనా విరుచుకుపడ్డ సాధ్వీ, ‘‘రాహుల్... సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకో. మీ తల్లి, సోదరి ఆందోళన చెందుతున్నారు. అయితే మీరు వివాహమాడే యువతి భారతీయురాలైతే సంతోషిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.