: ముఫ్తీ వ్యాఖ్యలపై అట్టుడికిన పార్లమెంట్... కాంగ్రెస్ వాకౌట్
జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగేందుకు పాకిస్తాన్, హురియత్ లు సహకరించాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ సయీద్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో రగడ సృష్టించాయి. ముఫ్తీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ తదితర విపక్షాలు పట్టుబట్టడంతో, ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ముఫ్తీ మాటలు ఆయన వ్యక్తిగతమని, ప్రజల వల్లనే ఎన్నికలు విజయవంతం అయ్యాయని వివరించారు. ఈ విషయంలో ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదని, తాను ఆయనతో మాట్లాడి వివరణ ఇస్తున్నట్టు రాజ్ నాథ్ చెప్పారు. దీనిపై సంతృప్తి చెందని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.