: తిరుమలేశా... కేంద్రానికి మంచి బుద్ధినివ్వు: అలిపిరి వద్ద టీడీపీ ఆందోళన, ఉద్రిక్తత


కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఆందోళన పరంపర కొనసాగుతోంది. నిన్నటిదాకా కేవలం మాటలకే పరిమితమైన ఆ పార్టీ నేతలు, తాజాగా రోడ్డెక్కి మరి నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. తిరుపతిలోని వెంకన్న పాదాల చెంత అలిపిరిలో టీడీపీ చేపట్టిన నిరసన, నేటి ఉదయం ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రానికి మంచి బుద్ధినివ్వాలని నినాదాలు చేస్తూ టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు తిరుమల వెళ్లేందుకు యత్నించారు. వీరిని అలిపిరి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల అడ్డగింతతో టీడీపీ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామయ్యింది. చివరకు పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, కేంద్రానికి మంచి బుద్ధినివ్వాలని తిరుమలేశుడిని కోరేందుకే తిరుమల బయలుదేరామన్నారు. ఎన్నికల సందర్భంగా తిరుపతిలో చేసిన వాగ్దానాలను ప్రధాని నరేంద్ర మోదీ మరచారని కూడా వారు ఆరోపించారు. పోలీసులు అడ్డుకున్నా, తమ నిరసనను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News