: బాబు ఆవేదనలో అర్థముంది... అర్థం చేసుకుంటాం: వెంకయ్యనాయుడు
కేంద్ర బడ్జెట్ తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు పెంచాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరనున్నామని ఆయన చెప్పారు. బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను బడ్జెట్ లో పేర్కోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. లోటుపాట్లు సరిదిద్దుతామని కేంద్రం ప్రకటించిందని ఆయన చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన వెల్లడించారు. రైల్వే బడ్జెట్ ఫలాలు మరో రెండేళ్ల తరువాత ప్రజలకు అందుతాయని ఆయన అన్నారు. తాము జారీ చేసిన 6 ఆర్డినెన్సులు త్వరలో లోక్ సభలో చర్చకు రానున్నాయని ఆయన తెలిపారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.