: రాహుల్ గాంధీ ఆత్మశోధనకు 'ఆనంద్ భవన్' సరైన స్థలమట!


బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి సెలవు పేరిట అజ్ఞాత ప్రదేశంలోకి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు విమర్శకులకు కేంద్ర బిందువయ్యాడు. కొందరు పలాయనం చిత్తగించాడంటే, మరికొందరు అస్త్రసన్యాసం చేశాడన్నారు. ఇంకొందరు, అమ్మపై అలిగాడని సెటైర్లేశారు. ఆ విషయం పక్కనబెడితే, కాంగ్రెస్ యువరాజు ఎక్కడున్నారన్నది ఇంకా వెల్లడికాలేదు. ఉత్తరాఖండ్ లో ఉన్నారని వార్తలొచ్చినా, నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో, అలాహాబాదులో పోస్టర్ల యుద్ధం నడుస్తోంది. హసీబ్ అహ్మద్, శ్రీచంద్ దూబే అనే ఇద్దరు కార్యకర్తలు రాహుల్ నుంచి ప్రియాంక పగ్గాలు అందుకోవాలని పోస్టర్లు వేయించారు. అటు, ఇటీవలే బీజేపీలోకి దూకిన అమర్ వైశ్యా 'మున్నా భయ్యా' అనే మాజీ కాంగ్రెస్ కార్యకర్త ఇంకాస్త ముందుకెళ్లి... రాహుల్ ఎక్కడున్నాడో కనిపెట్టిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తామని పోస్టర్లు అంటించాడు. "కాంగ్రెస్ కమాండర్ రాహుల్ కనిపించడంలేదు. ఎక్కడున్నాడో వెతికి పట్టుకున్నవారు భారీ బహుమతి సొంతం చేసుకోవచ్చు" అని పోస్టర్లలో పేర్కొన్నాడు. మున్నా భయ్యా మాట్లాడుతూ, రాహుల్ ఆత్మశోధన కోసం వెళ్లాడని అంటున్నారని, అదే నిజమైతే ఆత్మశోధన చేసుకునేందుకు ప్రయాగ (అలహాబాద్)లోని 'ఆనంద్ భవన్'ను మించిన స్థలం లేదని వ్యాఖ్యానించాడు. (ఆనంద్ భవన్ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన హౌస్ మ్యూజియం. అలహాబాదులో ఇది చారిత్రక ప్రదేశంగా పేరుగాంచింది). తాను సామాన్యుడి మనోగతాన్ని పోస్టర్ ద్వారా ఆవిష్కరించానని మున్నా భయ్యా ఘనంగా చెప్పుకున్నాడు.

  • Loading...

More Telugu News