: తుపాకీని పక్కనబెట్టి వరల్డ్ కప్ లో దూకాడు!
దుబాయ్ లో అతనో పోలీసు అధికారి. పేరు ఫహాద్ అల్ హషామి. ఇప్పుడతను ఉద్యోగానికి సెలవుపెట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు తరపున వరల్డ్ కప్ లో ఆడుతున్నాడు. ఆ జట్టులో యూఏఈ జాతీయులు ఇద్దరే ఉండగా, వారిలో ఫహాద్ ఒకడు. మిగతా వారంతా ఆయా ఆసియా దేశాల నుంచి వలస వచ్చినవారే. ఆ విషయం అటుంచితే... 32 ఏళ్ల ఫహాద్ తొలుత ఫుట్ బాల్ గోల్ కీపర్ గా స్కూల్లో స్పోర్ట్స్ కెరీర్ ప్రారంభించిన ఈ భారీకాయుడు ఈ తర్వాత వికెట్ కీపింగ్ వైపు మళ్లాడు. కోచ్ ప్రోత్సహించడంతో బౌలింగ్ ను ఎంచుకున్నాడు. గత పన్నెండేళ్లుగా దుబాయ్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్నాడు. వరల్డ్ కప్ లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్న ఫహాద్... తమ జట్టులో భిన్న దేశాలకు చెందిన వారున్నా, తామందరం ఒక్కటేనని ఉద్ఘాటించాడు. ఇక, తన పై అధికారుల గురించి చెబుతూ, వారికి క్రికెట్ అంటే పెద్దగా తెలియదని నవ్వేశాడు. అయితే, వారు తనను ఎంతగానో ప్రోత్సహిస్తారని తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలని వెన్ను తడుతుంటారని చెప్పాడు. మ్యాచ్ ఉన్న రోజున డ్యూటీ ఉంటే ఓ ఫోన్ కాల్ చేస్తే చాలు, నిక్షేపంగా వెళ్లి ఆడుకోమని ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చాడు.