: ఆ గెలుపుతో టీమిండియా ఖాతాలో మరో ఘనత
వరల్డ్ కప్ లో యూఏఈ జట్టుపై నెగ్గిన టీమిండియా ఖాతాలో మరో ఘనత చేరింది. ఇప్పటివరకు అత్యధిక వన్డేలు నెగ్గిన జట్ల జాబితాలో ఇప్పుడు భారత్ రెండోస్థానానికి చేరింది. యూఏఈపై నెగ్గడం ద్వారా భారత్ ఇప్పటివరకు 440 వన్డేలు గెలిచినట్టయింది. ఆస్ట్రేలియా 859 వన్డేల్లో 523 విజయాలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. కాగా, ఈ జాబితాలో పాకిస్థాన్ జట్టు కూడా రెండోస్థానంలో ఉంది. అయితే, భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. పాక్ ఖాతాలోనూ సరిగ్గా 440 విజయాలే ఉన్నా, వాళ్లు భారత్ కంటే తక్కువ మ్యాచ్ లాడారు. భారత్ 875 మ్యాచ్ లలో 440 విజయాలు నమోదు చేయగా, పాక్ 832 మ్యాచ్ లలోనే ఈ ఘనత సాధించింది. ఇక, వెస్టిండీస్ 728 వన్డేల్లో 372 విజయాలు, శ్రీలంక 748 వన్డేల్లో 354 విజయాలు, దక్షిణాఫ్రికా 531 వన్డేల్లో 328 విజయాలు సాధించాయి. ఇక, ఇంగ్లండ్ 641 వన్డేల్లో 308 విజయాలు సాధించగా, న్యూజిలాండ్ 677 వన్డేల్లో 295 విజయాలు నమోదు చేసింది.