: అంతరిక్షంలోకి రష్యా చిట్టెలుకలు, నత్తలు
అంగారకుడిపైకి మనిషిని పంపించి చూడాలనేది అగ్రదేశాల ప్రస్తుత టార్గెట్. దీనికి నాసా తన ప్రయత్నాలు తాను చేస్తుండగా.. మరోవైపు రష్యా ఈ ప్రక్రియలో భాగంగా.. అంతరిక్షంలోకి చిట్టెలుకల్ని పంపి పరీక్షిస్తోంది. తాజాగా 45 చిట్టెలుకలతో రోదసిలోకి ప్రయాణం చేయించింది. వాటికి తోడు నత్తలు, న్యూట్స్, జెర్బిల్స్ అనే చిన్న ప్రాణులు కూడా ఉన్నాయి. వీటిని బియన్ ఎం అనే క్యాప్సూల్లో పెట్టి రాకెట్ ద్వారా కజకిస్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు.
అంతరిక్షంలో బరువు రాహిత్యానికి ఈ జీవులు ఎలా తట్టుకుంటాయో చూడడమే వీరి లక్ష్యమని సంబంధిత అధికారి వాలెరి అబ్రాస్కిన్ చెప్పారు. ఈ ప్రాణులు 30 రోజులు ప్రయాణించి, మే 18న పారాచ్యూట్ ద్వారా రష్యా ఓరెన్బర్గ్లో కిందికి దిగేస్తాయిట. అంగారకుడిపై మనిషిని పంపే లక్ష్యంతో 2030 నాటికి చంద్రుడిపై ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలనేది రష్యా ప్రస్తుత టార్గెట్గా ఉంది.