: కేసీఆర్ రాకతో పోలీసుల అతి... గుట్టలో భక్తులకు అసౌకర్యం
రాజకీయ ప్రముఖులు దేవాలయాలకు వస్తే అక్కడ భక్తులకు నరకయాతన తప్పదు. దర్శనం నిలిపివేస్తారు. భక్తులు క్యూ లైన్లలోనే నిలిచిపోవాల్సి ఉంటుంది. సదరు నేతాశ్రీలు వెళ్లిపోయేదాకా వారికి కడగండ్లు తప్పదు. నేతల అనుచరగణం చేసే హల్ చల్ అంతాఇంతా గాదు. దేవస్థానం అంతా తమదే అన్నట్టు ప్రవర్తిస్తారు. అధికార పార్టీకి చెందిన వారైతే ఇక చెప్పనక్కర్లేదు. అధికారులు, పోలీసులు... ఒకటే హడావుడి! నేడు యాదగిరిగుట్టలో అలాంటి సీనే కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అతి చేశారు. భక్తులను కొండ కిందే నిలిపివేశారు. రెండు గంటల పాటు వారు అలా మండుటెండలోనే నిల్చున్నారు. తాగడానికి నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో భక్తులకు పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఆగ్రహించిన భక్తులు "సీఎం... డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. మీడియా ప్రతినిధులను సైతం పోలీసులు అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది.