: వరల్డ్ కప్ లో సెకెండ్ హయ్యెస్ట్ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా... వెస్టిండీస్ విజయ లక్ష్యం 409
సారధి జూలు విదల్చడంతో నేటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 408 పరుగులు చేసింది. వరల్డ్ కప్ గ్రూప్-బీలో నేటి ఉదయం వెస్టిండీస్ తో ప్రారంభమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన సఫారీలు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆరో ఓవర్ లోనే జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఓపెనర్ డికాక్ (12) వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. అయినా ఏమాత్రం భయపడని హషీమ్ అమ్లా(65), మరో స్టార్ బ్యాట్స్ మన్ డుప్లెసిస్ (62) తో కలిసి జట్టు స్కోరును పరుగెత్తించాడు. ఆ తర్వాత రిలీ రోస్సో (61) కూడా రాణించాడు. తదనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ డివిలియర్స్(66 బంతుల్లో 17 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 162 పరుగులు) వెస్టిండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలెట్టిన డివిలియర్స్ 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరి ఓవర్ లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సఫారీలు 408 భారీ స్కోరు సాధించారు. తద్వారా వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యుత్తమ స్కోరును నమోదు చేశారు. సఫారీ కెప్టెన్ ఊచకోతతో బెంబేలెత్తిపోయిన వెస్టిండీస్ 409 పరుగుల విజయ లక్ష్యంతో కొద్దిసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.