: డివిలియర్స్ రికార్డు శతకం... వరల్డ్ కప్ లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్
వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగుతోంది. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించి వెస్టిండీస్ సంచలనం క్రిస్ గేల్ రికార్డు సృష్టించగా, అతడి జట్టుపై కొద్దిసేపటి క్రితం సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రికార్డు శతకాన్ని సాధించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేసిన డివిలియర్స్, వరల్డ్ కప్ లో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. 66 బంతుల్లో 17 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో విరుచుకుపడిన డివిలియర్స్ మొత్తం 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలర్ ఎవరనే ప్రసక్తి లేకుండా ముందుకొచ్చిన ప్రతి బంతిపైనా విరుచుకుపడిన డివిలియర్స్ వరల్డ్ కప్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. చివరి ఓవర్ లో నాలుగు సిక్స్ లు బాదిన డివిలియర్స్ 30 పరుగులు రాబట్టాడు. వెరసి వెస్టిండీస్ పై సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 408 పరుగులు చేసింది. డివిలియర్స్ జూలు విదల్చడంతో సౌతాఫ్రికా వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యుత్తమ స్కోరును సాధించింది.