: నువ్వు ఉగ్రవాదివంటూ... మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడికి పోలీస్ ట్రీట్ మెంట్!
ఒకప్పుడు దేశాన్ని ఏలిన అధ్యక్షుడు. ఇప్పుడు పోలీసు దెబ్బలు రుచి చూస్తున్నాడు. అతనే మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్. నిన్న రాత్రి రహస్యంగా ఆయనను కోర్టు ముందు హాజరు పరిచారు. 'నేనేం ఉగ్రవాదిని కాదు. అలాంటి పనులేవి చేయలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు ప్రజలు ఇచ్చిన మద్దతే అందుకు సాక్ష్యం' అని ఆయన న్యాయమూర్తి ముందు వాపోయారు. నషీద్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఓ సీనియర్ న్యాయమూర్తిని అకారణంగా నిందితుడిగా పేర్కొని అరెస్టు చేయించారని, ఆ కారణంగా ప్రశాంతతకు మారుపేరైన మాల్దీవుల్లో ఘర్షణల వాతావరణం నెలకొందని, ఇలాంటి చర్యలు ఉగ్రవాదం కిందికే వస్తాయని పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను రోడ్డిపైనే విపరీతంగా కొట్టడంతో ముంజేయి ఎముక కూడా విరిగింది. నషీద్ ను రోడ్డు మీద దారుణంగా ఈడ్చుకెళ్ళిన పోలీసులు తమదైన ట్రీట్ మెంట్ ఇస్తున్నారట. కాగా, కేసు విచారణను 3 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారం దురదృష్టకరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.