: యుఏపీఏ కింద ఐఎస్ఐఎస్ పై నిషేధం విధించిన కేంద్రం
ప్రపంచ దేశాలకు సవాల్ గా మారిన ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపుపై భారత్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఏపీఏ) కింద నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. గత ఏడాది ఐఎస్ఐఎస్ పై ఐక్యరాజ్యసమితి షెడ్యూల్ అనుసరించి భారత్ లో సాధారణ నిషేధం విధించారు. తాజాగా, కఠినమైన యుఏపీ చట్టం వర్తింపజేశారు. ఐఎస్ఐఎస్ గ్రూపు ప్రపంచవ్యాప్తంగా యువతను విశేషంగా ఆకర్షిస్తుండడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. ఈ మిలిటెంట్ గ్రూపు ద్వారా శిక్షణ పొందిన భారత యువత స్వదేశానికి తిరిగివచ్చి విధ్వంసాలకు పాల్పడే అవకాశముందని కేంద్రం ఆందోళన చెందుతోంది. ముంబయికి చెందిన నలుగురు యువకులు ఐఎస్ గ్రూపులో చేరేందుకు 2014లో ఇరాక్, సిరియా దేశాలకు తరలివెళ్లారు. వారిలో ఒకరు భారత్ తిరిగి రాగా, మిగతా ముగ్గురి ఆనుపానులు తెలియరాలేదు. గత నెలలో హైదరాబాదు నుంచి సిరియా వెళుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. ఐఎస్ అనుకూల ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నది బెంగళూరు వ్యక్తేనన్న విషయం దేశంలో మరింత కలకలం రేపింది.