: రాహుల్, సోనియాలు ఒకే మాటపై నిలబడేవారు కాదు ... మరో బాంబు పేల్చిన దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజాస్వామ్యవంతం చేసేలా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను సోనియా అడ్డుకునేవారని, పలు విషయాల్లో వీరిద్దరూ ఒకే మాటపై నిలిచేవారు కాదని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల నియామకాల్లో కింది స్థాయి కార్యకర్తలను ప్రోత్సహిస్తే, తాము అనుభవిస్తున్న హోదాలు కోల్పోతామని కొందరు నేతలు భావిస్తున్నారని ఆయన విమర్శించారు. రాహుల్ దీనిపై దృష్టిని సారించి కష్టపడే కార్యకర్తలకు మంచి పదవులు ఇవ్వాలని భావించేవారని, కానీ ఢిల్లీలో ఉండే బలమైన నేతలు ఆయన ఆలోచనలకు బ్రేకులు వేసేవారని తెలిపారు. రాహుల్, సోనియాల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, తరాల అంతరం కారణంగా ఒకే నిర్ణయం తీసుకోలేక పోయేవారని, చాలాసార్లు కొడుకును పక్కనబెట్టి, సీనియర్ల సలహాల అమలుకే సోనియా మొగ్గు చూపేవారని వివరించారు. కాగా, దిగ్విజయ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనం కలిగిస్తున్నాయి.