: పార్లమెంటులో చంద్రబాబుకు ప్రశంసలు... ఆకట్టుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు
పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తన ప్రసంగంతో అన్ని పార్టీలను ఆకట్టుకున్నారు. వెంకయ్య వ్యాఖ్యలతో వాయిదాల పర్వం అనంతరం లోక్ సభ తిరిగి ప్రారంభమైన వెంటనే రామ్మోహన్ నాయుడు ప్రసంగంతో సభ పిన్ డ్రాప్ సైలెంటైంది. యువ ఎంపీ ప్రసంగాన్ని స్వపక్ష ఎంపీలతో పాటు విపక్షాల సభ్యులు కూడా ఆసక్తిగా విన్నారు. ఏపీలో విద్యుదుత్పత్తి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న విద్యుత్తు, వ్యయం తదితరాలపై రామ్మోహన్ నాయుడు పక్కా సమాచారంతో పాటు సమగ్రంగా ప్రసంగించారు. రామ్మోహన్ ప్రశ్నలకు స్పందించిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, సోలార్ విద్యుదుత్పత్తిపై ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. ఈ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మెరుగైన చర్యలు తీసుకుంటూ, మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారన్నారు. అంతేకాక ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి, చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన సూచనలను పరిశీలిస్తామని మంత్రి ప్రకటించారు.