: నటి దియా మీర్జా, బీజేపీ ఎంపీ మధ్య మదర్ థెరిస్సా వివాదం
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరిస్సాపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. పలువురిని మతమార్పిడి చేసేందుకే పేదలకు థెరిస్సా సేవ చేశారంటూ భగవత్ ప్రకటించడాన్ని బాలీవుడ్ అందాల నటి దియా మీర్జా ఖండించారు. "నా తండ్రి క్యాథలిక్, తల్లి ఓ బెంగాలీ, నన్ను పెంచిన తండ్రి ముస్లిం. నేను ఓ హిందువును పెళ్లి చేసుకున్నాను. నేను భారతీయురాలిని" అని ట్విట్టర్ లో దియా పేర్కొంది. అయితే భగవత్ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ, క్రైస్తవమతంలోకి ప్రజలను తీసుకురావడమే తన లక్ష్యమని ఓ సందర్భంగా మదర్ చెప్పారని ట్వీట్ చేశారు. ఇక్కడే ఎంపీకి, దియాకు మధ్య అసలు వివాదం మొదలైంది. గర్హించాల్సిన, ఖండించాల్సిన వ్యాఖ్యలను సమర్థించడం సిగ్గుచేటని, సిగ్గుతో తన తలదించుకోవాలని దియా ట్వీట్ చేసింది. ఇందుకు ఎంపీ కూడా దీటుగానే స్పందిస్తూ, వాస్తవాలను ఎదుర్కొనే సామర్థ్యం లేని వ్యక్తిగా మీరు సిగ్గుపడాలని అన్నారు. ఇలా థెరిస్సాపై ఇద్దరి మధ్య ట్విట్టర్ లో మాటల యుద్ధం జరిగింది.